శ్రీ విద్యా రామచంద్ర స్వామి

శ్రీ విద్యా రామచంద్ర స్వామి వారి సంగ్రహ చరిత్ర.

శ్రీ మహా విద్య పీఠం లో ఉన్న ఆలయాలలో, శ్రీ విద్యా రామచంద్ర స్వామి వారి అలయం ఒకటి. ఈ ఆలయం లో ప్రతిష్టించబడిన విగ్రహం ఎంతో విశిష్టమైనది.

విత్ అనగా జ్ఞానము, విద్య అనగా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడం. శ్రీ రాముడి ని  దశరథ రాముడు అని, అయోధ్యా రాముడు అని, కౌసల్య సుప్రజ రామ అని, అనేక విధాలుగా వర్ణిస్తారు. కానీ జగన్మాత భూజాత సకల లోక మాత అయినటువంటి సీతమ్మ వారిని మాత్రం జానకి అమ్మ వారని, సీతమ్మ వారని పిలుస్తారు, కానీ ఆవిడ సర్వ విద్య స్వరూపిణి అని ఆవిడ అష్టోత్తర నామాలలో వివరించబడింది. ఆవిడ సకల విద్యలు కూడా తెలుసుకున్న వ్యక్తి. అందుకు ఒక చిన్న ఉదాహరణ, రాములవారి పట్టాభిషేక నిర్ణయం తరువాత, కైకేయి ధశరదుడి ని తన వరాలు అడుగగా, ఆ సందర్భం లో రాముని కి వనవాసం నిర్ణయించబడింది. పితృవాక్య పరిపాలకుడు కాబట్టి, తండ్రి ఆజ్ఞ మేరకు రాముడు వనవాసానికి బయల్దేరుతాడు. అప్పుడు రాముల వారితో సీతమ్మ వారు కూడా బయలుదేరుటకు సిద్ధం అవుతారు. కైకేయి కోరిన కోరికల్లో ఎక్కడ సీత కూడా వనవాసానికి వెళ్ళాలి అని కోరలేదు కానీ సీతమ్మ వారు బయలుదేరారు. అందుకు రాముల వారు, సీతమ్మ వారితో, “నువ్వు చక్రవర్తి కుమార్తెవి, నువ్వు నాతో అరణ్యానికి వస్తే కష్టపడతావు, వద్దు” అనగా, అందుకు సీతమ్మ వారు, “నాకు అరణ్యాల గురించి తెలుసు, మా ఇంటికి మా చిన్నతనం లో అనేక మంది మహర్షులు వస్తూ ఉండేవారు. వాళ్ళకి నేను సేవ చేస్తూ ఉండేదానిని, ఆ సమయంలో అరణ్యం లో ఉండేటువంటి అనేక విషయాలను గూర్చి నాకు చెప్పారు, ఆ కష్టసుఖాలు అనేవి నాకు తెలుసు కాబట్టి, నేను కూడా వస్తాను” అని బయలుదేరింది. అందుకే సీతమ్మ వారిని విద్య స్వరూపిణి అని, వేద జనని అని, వేద మాత అని కూడా పిలుస్తారు.

మా పీఠానికి మహా విద్య పీఠం అని పేరు ఉండడం వలన ఇక్కడ అమ్మవారిని విద్యా స్వరూపం లో, పరిపూర్ణావతరం లో ధనుర్ బాణాలేమీ లేకుండా రాముడిని పరబ్రహ్మ స్వరూపం లో, శ్రీ విద్యా రామచంద్ర స్వామి గా ప్రతిష్టించబడి పూజించబడుతుంది.

ఇక్కడ రాముల వారు, తేజోవంతుడి గా ప్రకాశిస్తూ, వీరాసనం లో, ఒక కాలు పై మరొకటి వేసుకొని, జ్ఞాన ముద్ర లో, ఎడమ చేతి ని మోకాలి పై వేసుకొని, ఎడమవైపున, కుడి చేతి లో పద్మాన్ని పట్టుకున్న సీతమ్మ వారితో, వెనుక ఆది శేషుని రూపం లో ఉన్నటువంటి లక్ష్మణ స్వామి తో, అనేక రకాలైన ఆభరణాలతో అలంకరించబడి దర్శనమిస్తాడు.

రాముడి కి పూజ చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది, అని రామాయణం లో అనేక సందర్భాలలో వివరించబడినది. అటువంటి విగ్రహాన్ని మా పూర్వీకులు అర్చించి, ఆ దైవ సంకల్పం తో ఏకశిలా విగ్రహం గా ప్రతిష్టించి, విద్యా రాముడు అని నామకరణం చేయడం జరిగింది.